అల్లూరి జిల్లాలో ఓ విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. మంప- కొయ్యూరు సమీపంలో అనుమానాస్పదస్థితిలో మృతదేహం లభ్యమవడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఆ తర్వాత.. మృతదేహం మనోజ్ దేనంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే.. ఆ మృతదేహం తమ బిడ్డది కాదని తల్లిదండ్రులు, బంధువులు చెప్తుండడం సంచలనంగా మారింది.
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం గిరిజన గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వంతల మనోజ్.. వారం రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. అయితే.. మనోజ్ మృతి చెందినట్లు పోలీసులు సమాచారం ఇవ్వడంపై తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్, వార్డెన్, పోలీసుల తీరుపై ఫైర్ అవుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లో డెడ్‌బాడీ తమ బాబుది కాదంటున్నారు విద్యార్థి తల్లిదండ్రులు. వారం రోజుల క్రితం అదృశ్యమయితే రాత్రి ఫోన్ చేసి డెడ్‌బాడీ దొరికినట్లు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ బిడ్డను అప్పగించకుంటే ప్రిన్సిపల్‌ను, ఎస్‌ఐని వదిలిపెట్టేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఐ, ప్రిన్సిపల్ కలసి గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. తమ బాబును వెతికేందుకు డబ్బులు ఇవ్వాలని ఓ కానిస్టేబుల్ అడిగారని మండిపడ్డారు తల్లిదండ్రులు.
డెడ్‌బాడీ తమ మేనల్లుడిది కాదని చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థి మేనమామ అజయ్‌కుమార్. హాస్టల్ నుంచి వెళ్లినప్పుడు టీ-షర్ట్‌లో ఉన్నాడని.. మృతదేహానికి మరో డ్రెస్ ఉందని ఆరోపించారు. తమ మేనల్లుడి మిస్ అయిన సమయంలోనే మరో 10మంది విద్యార్థుల వరకు అదృశ్యం అయ్యారని ప్రిన్సిపల్ చెప్పారని, వాళ్లలో ఎవరిదైనా మృతదేహం కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. స్కూల్‌లో విద్యార్ధుల పర్యవేక్షణ లోపించిందని, ప్రిన్సిపల్, వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
ఇదిలావుంటే.. తల్లిదండ్రులు చెప్తున్నట్లు మృతదేహం విద్యార్థి మనోజ్ కాకుంటే.. ప్రస్తుతం నర్సీపట్నం ఆస్పత్రిలో ఉన్న డెడ్‌బాడీ ఎవరిది?.. అనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..