ట్రాఫిక్ సిగ్నల్ అందరి జీవితాల్లో భాగంగా మారిపోయింది. రోడ్డుపై అందరూ సవ్యంగా వెళ్లడానికి ఇవి ఎంతో ఉపయోగపడుతాయి. కానీ ఈ సిగ్నళ్లను మనం ఉల్లంఘిస్తే చలానా కట్ అవుతుంది. అప్పుడు మాత్రం వీటిని ఎవడు కనిపెట్టాడ్రా? బాబాయ్.. అని అనుకుంటాం. చాలా మందికి ఈ ప్రశ్న తలెత్తే ఉంటుంది. మరి నిజానికి ఈ సిగ్నల్ ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు దీన్ని తయారు చేశారు? ఈ వివరాలన్నీ మీకోసం..
ప్రపంచం పురోగమిస్తున్న కొద్దీ రోడ్లపై వాహనాల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. ఫలితం ఇప్పుడు మనం చూస్తున్న ట్రాఫిక్ జామ్‌లే. దీనిని నియంత్రించడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరం పడింది. 1868లో వీటి కథ లండన్‌లో ప్రారంభమైంది. జనాభా పెరుగుతున్న కొద్దీ రోడ్లన్నీ గుర్రాలు, జట్కాలు, క్యారేజీలతో నిండిపోయేవి. దీంతో ఆయా రోడ్లపై నడిచే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా లండన్‌లోని పార్లమెంట్ స్క్వేర్‌లో ఎక్కువ సమస్యగా ఉండేది. పోలీసులు కూడా ట్రాఫిక్‌ను నియంత్రించలేకపోయారు. ఈ సమస్యను అధిగమించేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది.
మొదటి ట్రాఫిక్ లైట్
1868లో లండన్ రైల్వే క్రాసింగ్ వద్ద గ్యాస్ ఆధారిత ట్రాఫిక్ లైట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఎరుపు, ఆకుపచ్చ రంగులు మాత్రమే ఉండేవి. దీన్ని మాన్యువల్‌గా ఆపరేట్ చేసేవారు. అమెరికాలో మాత్రం చాలా లేటుగా ట్రాఫిక్ సిగ్నళ్లను ప్రవేశపెట్టారు. 1912 నుంచి సాల్ట్ లేక్ సిటీలో మొదటి విద్యుత్‌తో వెలిగే ట్రాఫిక్ లైట్లు అందుబాటులోకి వచ్చాయి. 1920 నుంచి ట్రాఫిక్ లైట్లలో మూడో రంగు పసుపు చేరింది. అప్పటి నుంచి సిగ్నళ్లలో మూడు లైట్లు ఉంటూ వస్తున్నాయి.
భారత్‌లో మొదటి సిగ్నల్..
భారతదేశంలో ట్రాఫిక్ లైట్ల వినియోగం 20వ శతాబ్దం మధ్యలో ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలోని అన్ని నగరాలు, పెద్ద పట్టణాల్లో ట్రాఫిక్ సిగ్నళ్లను ఉపయోగిస్తున్నారు.